సలార్ లో మరో టాలీవుడ్ నటుడు
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పవరఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా సలార్ సినిమాలో మరో తెలుగు నటుడి పేరు కూడా వినిపిస్తోంది. ఆ నటుడు మరెవరో కాదు. టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ సలార్ సినిమాలో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అంతేకాదు బ్రహ్మాజీ సలార్ సినిమాలో ఎలాంటి పాత్ర చేయనున్నాడనే విషయంలో క్లూ కూడా ఇచ్చాడు. తన కొడుకు సంజయ్ రావు హీరోగా వస్తున్న స్లమ్ డాగ్ హస్బెండ్ ఈ నెల 29న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్లలో బ్రహ్మాజీ పాల్గొన్నాడు.
స్లమ్ డాగ్ హస్బెండ్ ప్రమోషన్లలోనే బ్రహ్మాజీ తాను సలార్ లో నటించబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. గ్రే షేడ్ రోల్ లో బ్రహ్మాజీ కనిపించనున్నట్లు, ఆయన క్యారెక్టర్ పాజిటివ్దే అయినప్పటికీ మాస్, నెగిటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయని చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. అంతేకాదు తను కనిపించేది సలార్ ఫస్ట్ పార్ట్ లోనే అని కూడా బ్రహ్మాజీ కన్ఫర్మ్ చేశాడు.













