Aamir Khan: సినిమా బావుంటే ట్రోలింగ్ పని చేయదు

ఆమిర్ ఖాన్(Aamir Khan) హీరోగా సితారే జమీన్ పర్(Sithare Zameen Par) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కానుండగా, చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆమిర్ ఖాన్ చాలా చురుగ్గా పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. గత కొన్నాళ్లుగా సితారే జమీన్ పర్ థియేటర్లలో కాకుండా యూ ట్యూబ్ లోనే రిలీజవుతుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
దానిపై ఆమిర్ మాట్లాడుతూ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, థియేటర్ రిలీజ్ తర్వాతే సితారే జమీన్ పర్ యూట్యూబ్ లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని, ఓటీటీ రైట్స్ అమ్మడానికి నో చెప్పిన ఏకైక నిర్మాత తానే అని, దీని వల్ల తనకు ఆర్థికంగా నష్టమొచ్చినప్పటికీ తగ్గిపోతున్న థియేటర్ బిజినెస్ ను తిరిగి బలోపేతం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పాడు.
సితారే జమీన్ పర్ ఛాంపియన్స్ సినిమాకు రీమేక్ గా వస్తుందని వస్తున్న విమర్శలపై కూడా ఆయన మాట్లాడాడు. తాను రీమేక్స్ ను నమ్ముతానని, తన దగ్గరకు మంచి రీమేక్ వస్తే తప్పకుండా చేస్తానని, సినిమా తీయడం తన ఇష్టమని, చూడటం చూడకపోవడం మీ ఇష్టమని, ఇప్పటికే తాను పదికి పైగా రీమేక్‌లు చేస్తే అందులో లాల్ సింగ్ చద్దా(Lal Singh Chadda) తప్ప మిగిలిన సినిమాలన్నీ హిట్లుగానే నిలిచాయని, సినిమా బావుంటే ట్రోలింగ్ పని చేయదని ఆయన తెలిపాడు.