తేజ సినిమాకు అంత బడ్జెట్టా?
చైల్డ్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న చాలా మంది కుర్రాళ్లు తర్వాత హీరోలుగా మారి తమ లక్ ను టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వారిలో తరుణ్ మాత్రమే కొద్దో గొప్పో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తరుణ్ కూడా సినిమాలు లేక లైమ్ లైట్ లో లేడు. తరుణ్ తర్వాత మళ్లీ హీరోగా తనదైన మార్క్ వేసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అంటే తేజ సజ్జనే.
చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ, ముందు ఓ బేబీ సినిమాతో స్పెషల్ క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జాంబి రెడ్డి సినిమాతో హీరోగా మారి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తన కెరీర్ ను మార్చే హిట్ ను అందుకుంది మాత్రం హను మాన్ సినిమాతోనే.
హను మాన్ సినిమాతో తేజ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేశాడు. హను మాన్ తర్వాత తేజకు డిమాండ్ బాగా పెరిగింది. తన నుంచి తర్వాత ఎలాంటి సినిమా వస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తేజ సజ్జ హను మాన్ కంటే ముందే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే యాక్షన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు.
పీపుల్ మీడియా బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను ముందు చాలా లిమిటెడ్ బడ్జెట్ తో పూర్తి చేయాలనుకున్నారు. కానీ హను మాన్ తర్వాత తేజ సజ్జ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను పెద్ద స్థాయిలో మంచి క్వాలిటీతో రూపొందించాలని ప్లాన్స్ మొత్తం మార్చేశారు. దీంతో తక్కువలో పూర్తి చేద్దామనుకున్న సినిమా బడ్జెట్ రూ.40 కోట్లకు పెరిగింది. తేజ సినిమాకు ఇంత మొత్తం బడ్జెట్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మిరాయ్ ను ఈ వేసవి చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













