ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్
హను మాన్ సినిమా సక్సెస్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోతుంది. ఈ సినిమా సృష్టించిన రికార్డులలాంటివి మరి. సినిమా రిలీజ్ కు ముందే హను మాన్ సంచలనాలు సృష్టిస్తుందని ప్రశాంత్ చెప్పాడు. కానీ అతనిదంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు.
చివరకు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ నిలబడింది. తక్కువ బడ్జెట్ లో హను మాన్ ను విజువల్ వండర్ లా ప్రశాంత్ తీర్చిదిద్దిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో హను మాన్ కు సీక్వెల్ గా రానున్న జై హను మాన్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జై హను మాన్ తో పాటూ ప్రశాంత్ వర్మ మరికొన్ని భారీ సినిమాలు చేయడానికి కూడా రెడీ అయ్యాడు.
ఇదిలా ఉంటే తనతో పురాణ గాథలు తీయడానికి ఓ నిర్మాత వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్లు రీసెంట్ గా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓ ఎన్నారై తనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించిన ప్రశాంత్ వర్మ, తనకు రామాయణ, మహా భారత గాథలను సినిమాలుగా చేయాలన్న కోరిక ఉందని, కానీ మహా భారతాన్ని రాజమౌళి చేస్తానని చెప్పడంతో ఆ కోరికను విరమించుకున్నట్లు తెలిపాడు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణం తీయకపోతే తనే తీస్తానని కూడా ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమా జై హను మాన్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.













