సామాన్యుడిపై భారం.. భగ్గుమంటున్న వంట నూనెల ధరలు!
గృహిణుల వంటింటి బడ్జెట్ లెక్కలు మరోసారి తలకిందులు కానున్నాయి. ఇప్పటికే పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇప్పుడు వంట నూనెల (Edible Oils) రూపంలో మరో భారీ భారం పడబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రవాణా ఖర్చుల దెబ్బ నేరుగా సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టనుంది. మార్చి నెలలోనే వంట నూనెల ధరలు పెంచిన ప్రధాన కంపెనీలు, ఇప్పుడు కేవలం నెలల వ్యవధిలోనే మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతుండటం గృహస్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కంపెనీల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి
వ్యాపార లాభాలను కాపాడుకునే క్రమంలో దేశంలోని ప్రముఖ వంట నూనెల (Edible Oils) తయారీ, పంపిణీ సంస్థలైన ఏడబ్ల్యూఎల్ (AWL) అగ్రి బిజినెస్, ఇమామి ఆగ్రోటెక్, పతంజలి ఫుడ్స్ వంటి కంపెనీలు త్వరలోనే రిటైల్ ధరలను 5 నుంచి 6 శాతం మేర పెంచే అవకాశాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దిగుమతి ఖర్చులు తడిసి మోపెడవ్వడం, అదే సమయంలో దేశీయ మార్కెట్లో నూనెగింజల (Edible Oils) ధరలు అధికంగా ఉండటంతో కంపెనీల నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ముడిసరుకు కొరతతో కుచించుకుపోతున్న లాభాల మార్జిన్లను కాపాడుకోవాలంటే, ఆ భారాన్ని అనివార్యంగా వినియోగదారుల పైనే మోపక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
పశ్చిమాసియా సెగ.. సముద్ర రవాణాకు బ్రేకులు
ఈ ధరల మంటకు మూల కారణం పశ్చిమాసియా (Middle East) లో రాజుకున్న సైనిక ఘర్షణలే. ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గం ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా సరకు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు బుధవారం నాటికి బ్యారెల్‌కు ఏకంగా 115 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముడి చమురు ధరలు పెరిగితే, ఆటోమేటిక్‌గా నౌకల రవాణా వ్యయాలు (Freight charges), సముద్ర బీమా (Insurance) ఖర్చులు అమాంతం పెరుగుతాయి. ఈ భారీ రవాణా వ్యయం నేరుగా దేశీయ వంట నూనెల (Edible Oils) దిగుమతులపై పడుతోంది.
దిగుమతులపై ఆధారపడటమే ముప్పు
భారతదేశం తన వార్షిక వంట నూనె (Edible Oils) అవసరాల్లో దాదాపు 57 శాతానికి పైగా కేవలం విదేశీ దిగుమతుల పైనే ఆధారపడుతోంది. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలను మనం భారీగా దిగుమతి చేసుకుంటాం. గతేడాదితో పోల్చి చూస్తే వీటి కొనుగోలు ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయంగా పామాయిల్ ధర 14 శాతం, సన్‌ఫ్లవర్ నూనె 17 శాతం పెరగ్గా, సోయాబీన్ ఏకంగా 20 శాతం మేర ప్రియమైంది.
దీనికి తోడు, డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ తీవ్ర ఒత్తిడిలో ఉండటం దేశీయ దిగుమతిదారులకు మరింత శాపంగా మారుతోంది. ఈ ప్రతికూల ఆర్థిక, భౌగోళిక పరిస్థితులన్నీ కలిసికట్టుగా సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారబోతున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్‌కు వెళ్లి వంట నూనె (Edible Oils) కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








