మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ యంత్రాంగంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. అమెరికా జాతీయ ఆర్థిక మండలి (ఎస్ఈసీ)లో డిప్యూటీ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ భరత్ రామమూర్తి ఎంపికయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధాన రూపకల్పన ప్రక్రియను సమన్వయం చేసే ఎన్‌ఈసీకి ముగ్గురు సభ్యులను నియమించారు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. వారిలో ఆర్థిక విధానంలో అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా జోయెల్ గాంబుల్, ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా డేవిడ్ కామిన్ ను ఎంపిక చేశారు బైడెన్. ఎన్ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా రామమూర్తిని నియమించారు.
గతంలో సీఏఆర్ఈఎస్(కేర్స్) చట్టంపై వేసిన కాంగ్రెస్ పర్యవేక్షణ కమిషన్‌లో పనిచేయడానికి ఏప్రిల్‌లో రామమూర్తి నియమితులయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కు, ఆర్థిక సలహాదారుగా, ఆమె సెనేట్ కార్యాలయంలో బ్యాంకింగ్, ఆర్థిక విధానాలకర్తగా పని చేశారు రామమూర్తి. మసాచుసెట్స్‌లో జన్మించిన రామమూర్తి. హార్వర్డ్ కళాశాల, యేల్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.






