కరోనాకు ఏడాది.. బైడెన్ ప్రసంగానికి అంతా సిద్ధం!
ప్రపంచం మొత్తాన్ని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి వచ్చి ఏడాది కావస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను ప్యాండెమిక్గా ప్రకటించి గురువారం నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రజలను ఉద్దేశించి ప్రైమ్ టైమ్ ప్రసంగం ఇవ్వనున్నారు. గురువారం నాడు ఈ వీడియో ప్రసంగం అమెరికా ప్రజల ఇళ్లలో వినిపించనుంది. అమెరికన్లకు బైడెన్ ధైర్యం చెప్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో అమెరికా ప్రజలు చేసిన త్యాగాలను, దేశంలోని వివిధ కమ్యూనిటీలు, కుటుంబాలకు జరిగిన నష్టాన్ని గురించి బైడెన్ చర్చిస్తారని జెన్ తెలిపారు. అలాగే అమెరికాలో పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావడంలో ప్రజల పాత్ర గురించి కూడా బైడెన్ వివరిస్తారట. ఇదిలా వుండగా, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజల విషయంలో కరోనా నిబంధనలు కొద్దిగా సడలిస్తే బాగుంటుందని ఇటీవలే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. ఈ క్రమంలో బైడెన్ దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏడాది క్రితం..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణం. ఇటలీ వంటి దేశాలో ప్రతిరోజూ వేలాది మంది మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దీన్నొక చిన్న సమస్యగా అభివర్ణించారు. కొన్ని రోజులు వేచి చూస్తే పరిస్థితి అంతా సర్దుకు పోతుందని, ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికావల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆయన ఇలా ప్రకటించిన కొన్ని రోజులకే పరిస్థితి చేయి దాటిపోయింది. 2020 మార్చి 13న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను ప్యాండెమిక్గా ప్రకటించింది. అప్పుడు మళ్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. కరోనా గురించి మాట్లాడారు. అప్పుడే అమెరికా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో దేశంలోని వనరులన్నింటినీ ఒడ్డి కరోనాతో పోరాటం ప్రారంభించింది అగ్రరాజ్యం.
ప్రపంచంలో కరోనా మహమ్మారితో తీవ్రత ఎక్కువగా కనబడింది అమెరికాలోనే. ఇక్కడ ఇప్పటి వరకూ 5.38 లక్షల మందికిపైగా ఈ మహమ్మారికి బలయ్యారు. మొత్తమ్మీద సుమారు 3కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా కరోనా విషయం కీలక పాత్ర పోషించింది. అందుకే కరోనాపై పోరాడటానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని, ప్రజలకు అండగా ఉంటామని బైడెన్ ప్రకటించారు. కరోనాతో నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రతిపాదించారు. దీనికి సెనేట్‌లో ఆమోదం లభించింది. తాజాగా వాషింగ్టన్ డీసీలోని వెటరన్స్ ఎఫైర్స్ మెడికల్ సెంటర్‌ను బైడెన్ సందర్శించారు. ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని అన్న బైడెన్.. త్వరలోనే 100 మిలియన్ల మార్కును చేరుకుంటామని చెప్పారు.






