ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఆయనే కారణం.. అమెరికా
భారత్, అమెరికాల మధ్య బలమైన సంబంధాలకు రూపశిల్పి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అని అమెరికా అభివర్ణించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి ఆయన ముఖ్య కారణమని పేర్కొంది. భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నేత రిచర్డ్ వర్మ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య కొత్త పుంతలు తొక్కుతున్న సంబంధాలకు జైశంకర్ ఆధునిక రూపకర్త అని కితాబిచ్చారు. శ్రమించే తత్వమున్న భారతీయ అమెరికన్లు రెండు దేశాల బంధానికి ప్రధాన కారణమని అన్నారు. భారత్-అమెరికా మైత్రి ఈ దశాబ్దపు ముఖ్యమైన బంధాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అవి రోడ్డు ప్రయాణాల్లో ఎత్తుపల్లాల్లాంటివి. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్ వంటి గొప్ప వ్యక్తుల ఆలోచనలతో ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా మారాయి. ఈ మైత్రి మరింత బలపడడానికి గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న జైశంకర్ ముఖ్య కారణం అని అన్నారు.






