అమెరికాలో చిన్న రాష్ట్రాలకు శుభవార్త.. కొవిడ్ బిల్లులో కొత్త సవరణలు!
అమెరికాలో మరో కొత్త అధ్యాయానికి తెర లేవనుంది. కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అయిపోయిన ప్రజాజీవనాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజి బిల్లు సిద్ధమైంది. ఈ బిల్లుపై యూఎస్ సనేట్లో చర్చకు రంగం సిద్ధమవుతోంది. సెనేట్‌లో మొత్తమ్మీద 50 సీట్ల బలం ఉన్న డెమోక్రాట్లు ఎలాగైనా ఈ బిల్లును పాస్ చేయించాలని చూస్తున్నారు. ఎవరూ దీనికి వ్యతిరేకంగా ఉండకూడదనే వ్యూహంతో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని రాష్ట్రాలకు అందించే కనీస ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వెర్మాంట్ వంటి చాలా తక్కువ జనాభా గల రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తారని డెమోక్రాట్ల భావన. ఈ కొత్త సవరణతో జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు లభించే ఆర్థిక సాయం పెరుగుతుందని డెమోక్రాట్ల అభిప్రాయం.
సెనేట్‌లో ఈ బిల్లుపై 20 గంటల చర్చ జరుగుతుందిట. అయితే ఈ బిల్లును పూర్తిగా చదవాలని రిపబ్లికన్లు పట్టు బట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ భారీ బిల్లును పూర్తిగా చదవాలంటేనే కనీసం 10 గంటల సమయం పడుతుంది. మళ్లీ దీనిపై 20 గంటల చర్చ జరగాలి. దీంతో సెనేట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రెండు మూడు రోజులు దీనిపై చర్చ జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
బిల్లు భవిష్యత్తు ఏంటి?
ఎంత సమయం పట్టినా సరే సెషన్లో ఉండి ఈ బిల్లును పాస్ చేయించుకుంటాం అని డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. అయితే దీనిపై రిపబ్లికన్ల వాదన మరోలా ఉంది. ఈ తరంలోనే అత్యంత ప్రగతి శీల బిల్లును కరోనా మహమ్మారి కష్టాల చివరి అధ్యాయంలో ఎలాగైనా పాస్ చేయించుకోవాలని వాషింగ్టన్ డెమోక్రాట్లు పథకాలు వేస్తున్నారని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రజలకు ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సాయం ఈ నెల 14తో ముగియనుంది. ఈ క్రమంలో ఆ తేదీలోపే కొత్త బిల్లుకు ఆమోదం లభించేలా చేయాలని బైడెన్ సర్కారు భావిస్తోంది. మామూలుగా సెనేట్‌లో ఒక బిల్లుకు ఆమోదం లభించాలంటే కనీసం 60 ఓట్లు పడాలి. సెనేట్‌లో మొత్తం 48 మంది డెమోక్రాట్లు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు కూడా డెమోక్రాట్లకే మద్దతు ఇస్తున్నారు. దీంతో వీళ్ల వద్ద మొత్తం 50 సీట్లు ఉన్నట్లే. అంటే బిల్లు ఆమోదానికి అవసరమైన వాటికన్నా 10 ఓట్లు తక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఈ బిల్లును రికన్సిలేషన్ అనే ప్రత్యేక విధానంలో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సెనేట్‌లో 60 ఓట్లు అక్కర్లేదు. కేవలం మెజార్టీ ఓట్లు లభిస్తే చాలు బిల్లు పాసైపోయినట్లే. అంటే మొత్తం సెనేట్‌లోని 100 సీట్లలో 50 సీట్లు ఇప్పటికే డెమొక్రాట్లకు ఉన్నాయి. ఇక ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గనుక ఓటు వేస్తే ఈ బ్యాలన్స్ మారిపోయి డెమోక్రాట్లదే పైచేయి అవుతుంది.
మళ్లీ దాడి భయం
ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో కూడా యూఎస్ కాపిటోల్‌పై గతంలో జరిగి దాడి వంటి ఘటన జరిగే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఈ చుట్టుపక్కల నిరసన కారులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో చర్చ జరుగుతుండగా కొంతమంది ఆందోళన కారులు యూఎస్ కాపిటోల్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. దీంతో ఇక్కడ భద్రతను పటిష్టం చేసిన అధికారులు.. ఆ తర్వాత బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోసారి కాపిటోల్ దాడి వంటి ఘటన జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల సమాచారంతో ఇప్పటికీ ఇక్కడ భద్రతను ఇంకా పూర్తిగా తొలగించలేదు.






