వారిని విడిచిపెట్టం : జో బైడెన్
కాబూల విమానాశ్రయం వెలుపల జరిగిన వరుస ఉగ్రపేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతికారం తప్పదని హెచ్చరించారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ ముట్టబెడతామన్నారు. ఐసిస్ నేతలను హతమార్చాలని బలగాలను ఆదేశించారు. తమ విషన్ కొనసాగుతుందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను తరలిస్తామని బైడెన్ స్పష్టం చేశారు.
కాబూల్ విమానాశ్రయం బయట జరిగిన ఉగ్రదాడిలో తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్టు ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. తాము ప్రమాదకర మిషన్ను కొనసాగిస్తున్నామని, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా తన ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. ఈ నెల 31న గడువు తేది నాటికి తమ బలగాలను పూర్తి ఉపసంహరించుకుంటామని బైడెన్ పునరుద్ఘాటించారు. కాబూల్ ఆత్మాహుతి దాడి ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 12 మంది తమ సైనికులు ఉన్నట్లు తెలిపారు.






