అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి… సుప్రీంకోర్టు జడ్జిగా తొల్లి నల్ల జాతీయురాలు
అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్ (51)ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. తొలి నల్ల జాతీయురాలు దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించనుండటం చారిత్రక పరిణామం. గత రెండు శతాబ్దాలుగా శ్వేత జడ్జీలతోనే కొనసాగుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కూర్పులో వైవిధాన్ని తీసుకువస్తామని బైడెన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు జాన్సన్‌తో కలిసి అధ్యక్షుడు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ వేసవికాలం చివర పదవీ విరమణ పొందనున్న జస్టిస్ స్టీఫన్ బ్రేయర్ (83) స్థానంలో జాన్సన్ నియామకం జరగనుంది. ఈమె తన కెరియర్ ప్రారంభంలో స్టీఫన్ బ్రేయర్ వద్ద న్యాయ గుమాస్తాల్లో ఒకరిగా పనిచేయడం విశేషం.






