హెచ్-1బీ వీసాదారులకు జో బైడెన్ శుభవార్త
హెచ్-1బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమెటిక్ వర్క్ ఆథరైజేషన్ అనుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఇండో-అమెరికన్ మహిళలకు లబ్ది చేకూరనున్నది. వలసదారుల జీవితభాగస్వాముల తరపున ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి హెచ్ 4 వీసాదారులు ఆటోమెటిక్ ఆథరైజేషన్కు అర్హులే కానీ, గతంలో వారికి ఆ లబ్ధి చేరకుండా ఏజెన్సీ అడ్డుకున్నది. కానీ ఆలా చేయడం వల్ల అధిక జీతాలు వచ్చే ఉద్యోగాలను వాళ్లు కోల్పోవాల్సి వస్తోందని ఇమిగ్రేషన్ లాయర్స్ సంఘం తరపున జాన్ వాస్డెన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో వలసదారుల భాగస్వాములు ఇమిగ్రేషన్స్ లాయర్స్ సంఘాన్ని ఆశ్రయించారు. హెచ్-4 జీవిత భాగస్వాములకు ఊరట కల్పిస్తూ హోంల్యాండ్ సెక్యూర్టీ నిర్ణయం తీసుకున్నది. దీని పట్ల ఏఐఎల్ డైరెక్టర్ జెస్సీ బ్లెస్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ పర్మిషన్ కల్పించిన విషయం తెలిసిందే. 90 వేల మంది హెచ్`4 వీసాదారుల్లో చాలా మందికి వర్క్ ఆథరైజేషన్ లభించింది. వీరిలో ఎక్కువ శాతం మంది ఇండో అమెరికన్ మహిళలే ఉన్నారు.






