కొత్త వ్యవసాయ బిల్లు వద్దంటున్న కేసీఆర్
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తిలా ఉందని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. బిల్లు రైతులకు అన్యాయం చేసేలా ఉందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సీఎం వివరించారు. ‘‘పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్ల చేయడానికి ఉపయోగపడే బిల్లు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి’’ అని సీఎం చెప్పారు.













