తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్థానం..

ఈనెల 31న తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ .. తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలకు …గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. ఇక రాధాకృష్ణ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా సోమవారం రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు వెళ్లి రాధాకృష్ణన్ కు వీడ్కోలు పలికారు. కాగా.. బోనాల సందర్భంగా ప్రజలకు రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. మహాంకాళి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, పంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాల ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ నెల 31వతేదీ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.
జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. త్రిపుర రాష్ట్ర పూర్వపు రాజవంశానికి చెందిన జిష్ణు దేవ్ వర్మ.. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. ఆయన 2018 నుంచి 2023 వరకూ త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో జిష్ణు దేవ్ వర్మ సెపాహిజాలా జిల్లాలోని చరిలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిష్ణు దేవ్ వర్మ రచయిత కూడా కావడం విశేషం. ఆయన ఇటీవల తన జ్ఞాపకాల "Views, Reviews & My Poems" పేరుతో పుస్తకం విడుదల చేశారు. అంతే కాకుండా జిష్ణు దేవ్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా .ఆయన సతీమణి పేరు సుధా దేవ్ వర్మ.