పాస్ పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త .. 9న మెగా పాస్ పోర్ట్ మేళా
వేసవి సెలవుల దృష్ట్యా పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం మే 9న పాస్ పోర్ట్ (Passport) మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేళాతో నాలుగు వేల సాధారణ స్లాట్స్ అదనంగా అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ (Jonnalagadda Snehaja) ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. పాస్‌పోర్ట్ సేవలను మరింత వేగవంతం చేయడానికి రాష్ట్రంలోని ఐదు పాస్ పోర్ట్ కేంద్రాలు బేగంపేట్, ఎంజీబీఎస్, రాయదుర్గం, కరీంనగర్, నిజామాబాద్ లో నాలుగు వేల సాధారణ స్లాట్స్ విడుదల చేస్తున్నామని తెలిపారు. అందులో 3,100 స్లాట్స్ హైదరాబాద్ పరిధిలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో, 900 కరీంనగర్, నిజామాబాద్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన స్లాట్స్‌ను ఇప్పటినుంచే బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే స్లాట్ బుక్ అయిన వారు సైతం రీషెడ్యూల్‌తో మేళాను వినియోగించుకోవచ్చని వివరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కరీంనగర్ (Karimnagar) లో పెరిగిన డిమాండ్ దృష్ట్యా నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు మే 4 నుంచి ప్రస్తుతమున్న 220 అపాయింట్మెంట్స్ను 400కు పెంచుతున్నామని స్నేహజ చెప్పారు. అందులో ప్రస్తుతమున్న 160 సాధారణ స్లాట్స్‌ను 310కి, తత్కాల్ స్లాట్స్‌ను 60కి, పీసీసీ స్లాట్స్‌ను 30కి పెంచినట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 4,500 దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నట్టు చెప్పారు. సాధారణ అపాయింట్మెంట్స్ కోసం హైదరాబాద్‌లో 8-10 రోజులు, కరీంగనర్, నిజామాబాద్‌లో 8-12 రోజులు వేచి చూడాల్సి వస్తున్నది. పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్ పోర్ట్ కార్యాలయం వరకు రాకుండా సమాచారం తెలుసుకునేందుకు 040-27715333, 040-27715115, 040-27806657 ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇవి కూడా చదవండి








