రేవంత్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరిపాలనలో వేగం పెంచడం, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో ముగ్గురు కొత్త వాళ్లకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఖాళీగా ఉన్న ఒక స్థానంతో పాటు, పనితీరు సరిగా లేని ఇద్దరు మంత్రులను తప్పించి వారి స్థానాలను భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే కీలక శాఖల మంత్రుల పనితీరుపై ఇప్పటికే హైకమాండ్ నివేదికలు తెప్పించుకుంది. కొన్ని ప్రతిష్ఠాత్మక హామీల అమలులో వెనుకబడిన శాఖల బాధ్యతలను సమర్థులకు అప్పగించేలా భారీ మార్పులు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశం మరోసారి చర్చకు వచ్చింది. తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆయన పదేపదే చెప్తున్నారు. అయితే, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఇప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. అయితే కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశం అనే నిబంధనను అధిష్ఠానం తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డికి చోటు కల్పించాల్సి వస్తే, వెంకట్‌రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. పైగా సీఎం రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గ్యాప్ వచ్చినట్లు సమాచారం.
మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని తెలియగానే పలువురు సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, బాలూ నాయక్ మధ్య పోటీ నెలకొంది. బీసీ కోటాలో మున్నూరు కాపు వర్గం నుండి ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సైతం కేబినెట్ లోకి వెళ్లాలని ఆశిస్తున్నట్టు సమాచారం.
కేవలం కేబినెట్ మాత్రమే కాకుండా, టీపీసీసీలో ఖాళీగా ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతోంది. ఎస్సీ మాదిగ వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ లంబాడ వర్గం నుంచి బలరాం నాయక్ లేదా బెల్లయ్య నాయక్ ను కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి నాయిని రాజేందర్ రెడ్డి లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డికి చోటు దక్కవచ్చు. మైనార్టీల నుంచి అజ్మతుల్లా, ఫహీమ్ ఖురేషీ స్థానం ఆశిస్తున్నారు. వీళ్లతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధుయాష్కీని కొనసాగించాలా లేదా అన్నది, కోశాధికారిగా రోహిన్ రెడ్డి నియామకం వంటి అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
మొత్తానికి జూన్ 2 లోపు జరగబోయే ఈ మార్పులు అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కొత్త జోష్ నింపుతాయా లేక అసంతృప్తులకు దారితీస్తాయా అన్నది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








