ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో కొత్త మాడ్యుల్స్.. లబ్ధిదారుల గుర్తింపు ఇక మరింత సులభం!
Indiramma Houses : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకంలో పారదర్శకతను పెంచేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఉన్న సాంకేతిక చిక్కులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దరఖాస్తుదారుల గుర్తింపు క్షేత్రస్థాయి పరిశీలనలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో అధునాతన ‘కొత్త మాడ్యుల్స్’ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త మార్పుల వల్ల ఇకపై దరఖాస్తుదారులకు ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రక్రియ వేగవంతం కానుంది.
యాప్‌లో ప్రత్యేక ఫీచర్ల..
గతంలో లబ్ధిదారుల అర్హతను పరిశీలించేందుకు గెజిటెడ్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, మాన్యువల్ నివేదికలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ పాత విధానానికి స్వస్తి పలుకుతూ, మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేస్తూ యాప్‌లో ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. లబ్ధిదారుల ఎంపిక, డేటా మార్పులు, చేర్పులు అనుమతుల వంటి పనులన్నీ ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. ముఖ్యంగా బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు వీలుగా, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు బదలాయించారు. గతంలో ఎంపీడీవో లేదా పురపాలక కార్యాలయాల నుండి అనుమతులు రావడానికి రోజులు పట్టేది, కానీ ఇప్పుడు కలెక్టర్ నిర్ణయంతో తక్షణమే పరిష్కారం లభిస్తుంది.
‘ఎల్-3 నుంచి ఎల్-1కి’..
ప్రస్తుతం దరఖాస్తుదారులను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్-1 (23.30 లక్షల మంది), సొంత స్థలం లేని వారిని ఎల్-2 (21.49 లక్షల మంది), అనర్హులైన వారిని ఎల్-3 (32.98 లక్షల మంది)గా గుర్తించారు. అయితే చాలా ప్రాంతాల్లో ఎల్-1 జాబితాలో ఉండాల్సిన వారు పొరపాటున ఎల్-3లో ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ‘ఎల్-3 నుంచి ఎల్-1కి’ మార్చుకునేలా కొత్త మాడ్యుల్‌ను రూపొందించారు. ఈ మార్పుల వల్ల అర్హులైన పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా ఇళ్లు మంజూరు కానున్నాయి. యాప్‌లో జరిగిన ఈ తాజా మార్పుల ద్వారా దరఖాస్తుదారుల వివరాల పరిశీలన, ఆమోదం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.








