లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి..! ఆ ఏరియాపైనే ఫోకస్..!!
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలన్నీ ఆయా ఏర్పాట్లలో బిజీగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో జోరుమీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఓటమి భారాన్ని మోస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లోక్ సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో వాటిపై దృష్టి పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. జిల్లాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యేక పంథా అవలంభించాలని ఆయన భావిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. వాటిని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం గ్రహించిన బీఆర్ఎస్ అయిందేదో అయిపోయింది.. ఇక ప్రజల్లో ఉంటూ ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అన్వేషించుకుంటూ ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఓటమితో నిరాశలో ఉన్న కేడర్ లో జోష్ నింపేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఊతకర్ర సాయంతో నడవగలుగుతున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికలకు కేడర్ ను సమాయత్తం చేయాల్సి రావడంతో ఆయన యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లూ కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి కేడర్ తో చర్చిస్తున్నారు. తాజాగా కేసీఆర్ రంగప్రవేశం చేశారు. జిల్లాల వారీగా సమీక్షలు షురూ చేశారు. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు, పార్టీని కాపాడుకునేందుకు తీసుకోవాల్సి చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు.. లాంటి అనేక అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నారు.
అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, ప్రభుత్వ పనితీరు లాంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి ధారాదత్తం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని దక్షిణ తెలంగాణలో ప్రధానాంశంగా ఎంచుకుంది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల గడువు ముగుస్తుంది. ఈలోపు ఆరు గ్యారంటీలను ఆ పార్టీ అమలు చేస్తుందా.. లేదా అని చూస్తోంది. ఒకవేళ అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయితే దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది. ఒకవేళ ఆరు గ్యారంటీల అమలుకు విపరీతమైన షరతులు పెట్టి ప్రజలందరికీ అందకపోతే దాన్ని కూడా అజెండాగా మార్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరి ఈ అంశాలు బీఆర్ఎస్ కు ఏమాత్రం కలిసొస్తాయో వేచి చూడాలి.













