చంద్రబాబు + వైఎస్సార్ = కేసీఆర్…!? కేటీఆర్ చెప్పింది నిజమేనా…?
రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కొత్తపుంతలు తొక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, వైస్సార్ తమదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారంటూనే.. వాళ్లిద్దరూ కలిస్తే కేసీఆర్ అవుతారన్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ల పాలనతో కేసీఆర్ పాలనను బేరీజు వేసుకుంటున్నారు. వాళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూస్తున్నారు. అసలు ఎవరి పాలనలో ఏం జరిగింది..?
చంద్రబాబు రాష్ట్రానికి సీఈఓగా వ్యవహరించేవారు. ఆయన దృష్టంతా ప్రధానంగా అభివృద్ధి పైనే ఉండేది. పాలనను హైటెక్నాలజీతో నింపేసేవారు. ఐటీ, ఇండస్ట్రీస్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్ పోర్ట్, టూరిజం రంగాలపై ఆయన ఫోకస్ ఎక్కువగా ఉండేది. ఇవాళ హైదరాబాద్ లో ఐటీ రంగం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దాని వెనుక చంద్రబాబు కృషి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబును మించి ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ఆయన వేసిన బీజాలను కేసీఆర్- కేటీఆర్ కొనసాగించారు. అంతేకాక చంద్రబాబు లాగే అనేక పరిశ్రమల స్థాపనకు కృషి చేసారు. ఫార్మా సిటీతో పాటు ఐటీ రంగాన్ని హైదరాబాద్ నలుమూలలకు విస్తరింపజేయడంతో పాటు ఇతర జిల్లాలకు కూడా తీసుకెళ్లారు. గతంతో పోల్చితే మౌలిక వసతుల కల్పనలో ఇప్పుడు తెలంగాణ ఎంతో ముందుంది. అలా చంద్రబాబును మించి కేసీఆర్ మార్కులు తెచ్చుకున్నారు.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టంతా సంక్షేమంపైనే ఉండేది. పేదలు, రైతులు, మహిళలు.. ఇలా బడగు బలహీన వర్గాలను ఆదుకోవాలనేది ఆయన ఉద్దేశం. అందుకే పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, రుణమాఫీ.. లాంటి పథకాలతో ఆయన ప్రజలను ఆదుకున్నారు. సంక్షేమ రంగాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కొత్తపుంతలు తొక్కించారనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్షేమం అనే మాట వినిపిస్తే మొదట గుర్తొచ్చేది వైస్సారే.! ఇప్పుడు కేసీఆర్ కూడా సంక్షేమంలో ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. గతంలో అమలు చేసిన పథకాలను తీసేయకుండా కొనసాగిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా పెన్షన్లు ఇస్తున్నారు. వైద్యరంగంలో మరిన్ని మేలైన సౌకర్యాలను తీసుకొచ్చారు. రైతు బంధు పేరుతో రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీంతో అభివృద్ధితో పాటు సంక్షేమరంగం కూడా తెలంగాణలో ఇప్పుడు బాగుంది.
కేటీఆర్ అలా మాట్లాడగానే అందరూ ఆశ్చర్యపోయినా లోపలికి వెళ్లి చూసినప్పుడు వాళ్లిద్దరి కలయికే కేసీఆర్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లు వేసిన పునాదులను కేసీఆర్ సమర్థంగా వినియోగించుకున్నారు. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది అమలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సుభిక్షంగా ఉంది. అందుకే కేటీఆర్ పోలిక నిజమేకదా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.













