ఇంతకీ సీఎం, మంత్రుల .. ఎవరు చెప్పింది కరెక్ట్ : హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మరోసారి విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి (Tummidihetti) వద్ద కాంగ్రెస్ తీరు చూస్తే పని తక్కువ, హడావుడి ఎక్కువ అన్నట్టుందని వ్యాఖ్యానించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే 150 మీటర్లకు ఒప్పందం కుదిరిందని మంత్రి వివేక్ చెబుతున్నారని, మరి అప్పుడే ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదని ప్రశ్నించారు. తమతో ఒప్పందం లేకుండా పని చేస్తే పనులు వృథా అవుతాయని కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)కి అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లేఖ రాశారని గుర్తుచేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని, మరోవైపు తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు. ఇంతకీ ఎవరు చెప్పింది కరెక్ట్ అని నిలదీశారు. తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే మహారాష్ట్రకు తానే వెళ్లి మాట్లాడినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల అయినా మహారాష్ట్రతో మాట్లాడటం లేదని అన్నారు. ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా తుమ్మిడిహెట్టికి ఒప్పించలేదని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోని రూ.17 వేల కోట్లు ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ రూ.40 వేల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని ఆరోపించారు.








