కాళేశ్వరంపై రేవంత్ చక్రవ్యూహం!
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అదే సమయంలో వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేశారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ చేత దర్యాప్తు చేయించడం ద్వార అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టే వ్యూహానికి రేవంత్ పదును పెట్టారు.
సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులపై విచారణలు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుపోతుంటాయి. దీనిని ముందుగానే పసిగట్టిన రేవంత్ సర్కార్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తాజాగా మధ్యంతర ఆదేశాలు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీబీఐ సిఫారసులో ఆ కమిషన్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది. దీనికి బదులుగా, గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలను, ప్రాజెక్టులో జరిగిన నిధుల మళ్లింపు ఆరోపణలను ప్రధాన ప్రాతిపదికగా చూపారు. 9 నెలల కిందటే పంపిన ఈ సిఫారసు ద్వారా సీబీఐ రంగప్రవేశానికి ఉన్న సాంకేతిక అడ్డంకులను ప్రభుత్వం తొలగించింది. వ్యవస్థాగతమైన దర్యాప్తు ద్వారా బాధ్యులను బోనులో నిలబెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బీఆర్ఎస్ అగ్రనేతలపై చర్యలకు ఉపక్రమిస్తే, అది రాజకీయంగా కక్షసాధింపు అనే ముద్ర పడి సానుభూతిని తెచ్చిపెట్టే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఈ బంతిని కేంద్రం కోర్టులోకి విసిరారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అయిన ఈ కుంభకోణంపై కేంద్రమే విచారణ జరిపించాలని కోరడం ద్వారా బీజేపీ చిత్తశుద్ధిని రేవంత్ పరీక్షకు పెట్టారు. ఒకవేళ కేంద్రం సీబీఐ విచారణకు వెనుకాడుతే, “మోదీ-కేసీఆర్ ఒక్కటే” అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, బీజేపీని డిఫెన్స్‌లో పడేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. సీబీఐ దర్యాప్తునకు పచ్చజెండా ఊపితే ఆ క్రెడిట్ రేవంత్ ఖాతాలోకి వెళ్తుంది. ఒకవేళ మౌనంగా ఉంటే బీఆర్ఎస్ను కాపాడుతున్నారన్న విమర్శలు వస్తాయి.
కేవలం లేఖలతోనే సరిపెట్టకుండా, రేవంత్ రెడ్డి స్వయంగా సీబీఐ డైరెక్టర్‌ను కలవాలని లేదా మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని నిశ్చయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రాథమిక ఆధారాలను స్వయంగా అందజేయడం ద్వారా దర్యాప్తును అనివార్యం చేయాలన్నది వారి ప్లాన్. విచారణ జరిగినా, జరగకపోయినా.. ఈ అంశాన్ని కేంద్రంపైకి నెట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చని, ప్రజాధనం విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చని రేవంత్ సర్కార్ బలంగా నమ్ముతోంది. ఒకవేళ విచారణ ప్రారంభమై కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిస్తే, తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా పెను మార్పులు సంభవించడం ఖాయం. రేవంత్ రెడ్డి పన్నిన ఈ చక్రవ్యూహం నుండి ప్రత్యర్థులు ఎలా బయటపడతారో వేచి చూడాలి.








