మే 1 నుంచి తెలంగాణలో ‘రియల్’ ధరల మంట!
తెలంగాణలో స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు సిద్ధమైంది. అపార్ట్మెంట్ అయినా, ప్లాట్ అయినా, వ్యవసాయ భూమి అయినా.. ఇకపై మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మే మొదటి వారం నుంచే అమల్లోకి రానుంది. ఈ మార్పుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ భారం ఒక్కసారిగా పెరగనుంది.
రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ ఉపసంఘం ఇటీవల సచివాలయంలో కీలక భేటీ నిర్వహించింది. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవడమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో.. ఆస్తుల మార్కెట్ విలువల సవరణకు పచ్చజెండా ఊపారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య పొంతన లేకపోవడాన్ని గమనించిన ప్రభుత్వం, ఈ వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త రేట్లను సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖను ఆదేశించింది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ విలువల సవరణ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు అదనంగా సుమారు రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. కేవలం ఆదాయం మాత్రమే కాకుండా, మార్కెట్ ధరలను క్రమబద్ధీకరించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనం ప్రవాహాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. చాలా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలు ఆకాశంలో ఉండగా, రిజిస్ట్రేషన్ విలువలు మాత్రం తక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ గ్యాప్‌ను పూడ్చడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు, ఓపెన్ ప్లాట్ల విలువలు గణనీయంగా పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలను కూడా భారీగా పెంచబోతున్నారు. కమర్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ రేట్లు కూడా చుక్కలు చూపించనున్నాయి. కేవలం ఆస్తి విలువ పెరగడమే కాకుండా, ఆ పెరిగిన విలువపై చెల్లించే స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు అన్నీ కలిపి కొనుగోలుదారుడిపై భారాన్ని రెట్టింపు చేస్తాయి.
తెలంగాణలో గతంలో 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ విలువలను సవరించింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి విలువల సవరణ ఇదే కావడం గమనార్హం. నిజానికి ఏడాది క్రితమే ఈ రేట్లు పెరగాల్సి ఉన్నప్పటికీ, అప్పట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొన్న మందగమనం కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మార్కెట్ మళ్లీ పుంజుకోవడంతో ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తోంది.
మే మొదటి వారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయన్న సంకేతాలతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది. పెరిగే భారం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఏప్రిల్ నెలాఖరు లోపే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. స్లాట్ల బుకింగ్ కోసం జనం ఎగబడే అవకాశం ఉండటంతో రిజిస్ట్రేషన్ శాఖ కూడా అప్రమత్తమైంది.
ఇవి కూడా చదవండి








