కేసీఆర్ అస్త్రాలు…
కాకలుతీరిన రాజకీయనాయకుడు, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ఎన్నికల ముందు అమ్ములపొదిలోని అస్త్రాలను వరుసగా సంధిస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంపు, వీఆర్ఏ వ్యవస్థ రద్దు చేసి వారికి వేరే ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ అమలు.. ఇలా వరుసగా వరాల జల్లు కురిపిస్తున్నారు. అంటే అన్నివర్గాలకు ఏదో ఓ వరం ప్రకటిస్తూ.. వారిని గులాబీ పార్టీకి దగ్గర చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల బిల్ ను శాసనసభ, మండలిలో ఆమోదించారు.
ఎన్నికల సమయంలో విపక్ష కాంగ్రెస్ కు అస్త్రాలు లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ దుమ్ముదులిపి, బయటకు తీస్తున్నారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రకటించగా..రెండో విడత రుణమాఫీ అమల్లోకి తెచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ..బిల్లుకు శాసనసభ ద్వారా ఆమోదముద్ర వేయించారు. అంతకు ముందు వీఆర్ఏలను .. వేర్వేరు శాఖల్లోకి తీసుకున్నారు. ఇలా అన్నివర్గాల ఆగ్రహాలను చల్లార్చేలా కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు.
ఇప్పుడు ఉద్యోగులపైనా వరాల జల్లు కురిపిస్తామని సభలో సంకేతాలిచ్చారు. ఐఆర్ తో పాటు పీఆర్సీని పరిశీలిస్తున్నామన్నారు. అంటే ఎన్నికల సమయంలో ఉద్యోగులను మరోసారి దువ్వుతున్నారని చెప్పొచ్చు. అంతేకాదు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనని.. ఉద్యమసమయంలో చెప్పిన మాటలు నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రం ధనికవంతమైనప్పుడు.. ఉద్యోగులు కూడా ధనికులు కావాలన్నదే తమ థ్యేయమన్నారు.
ఎన్నికల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన కేసీఆర్… తన వద్ద చాలా అస్త్రాలున్నాయని.. వాటిని బయటకు తీస్తానన్నారు. కాంగ్రెసోళ్లు గెలిచేది లేదు.. అధికారంలోకి వచ్చేది లేదు. మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని పునరుద్ఘాటించారు. ఉమ్మడి పాలనలో అన్యాయాన్ని ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని ప్రగతిదిశగా తీసుకెళ్తున్నామన్నారు సీఎం కేసీిఆర్. పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని సభద్వారా ప్రజల్లోకి పంపేందుకు ఈ సభాసమావేశాలను… అధికార పార్టీ చక్కగా ఉపయోగించుకుందని చెప్పొచ్చు.
అయితే అన్నింటికన్నా ముఖ్యమైంది నిరుద్యోగ సమస్య. ఉద్యమ డిమాండ్లలో ఒకటైన నియామకాల విషయంలో మాత్రం ఇంకా ప్రకటన వెలువడడం లేదు. ఇప్పుడు ప్రకటించినవన్నీ ఆల్రెడీ ఓసారి హామీ ఇచ్చినవి, మరికొన్ని పెండింగ్ లో ఉన్నవి. కానీ ఉద్యోగాల విషయంలో మాత్రం అలాకాదు.. నిర్దిష్ట ప్రకటన ఉండాలి. దానికోసమే తెలంగాణలో యువత ఎదురుచూస్తోంది. మరి దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంటుందా? ఈఅంశానికి జవాబు దొరకాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.













