అమెరికా బాటలోనే సింగపూర్
ఇండియన్ ఐటీ కంపెనీలకు మరో దెబ్బ తగిలింది. సింగపూర్ కూడా అమెరికా బాటలోనే వెళ్తున్నది. తమ దేశంలో ఉన్న భారత ఐటీ కంపెనీలు స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం సృష్టం చేసింది. భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు జారీ చేసే వీసాలను గణనీయంగా తగ్గించింది. దీంతో ఐటీ కంపెనీలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. అటు వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని భావిస్తున్న భారత ప్రభుత్వం, కాంప్రెహెన్సివ్ ఎకనమిక్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (సీఈసీఏ) పున: సమీక్షపై పునరాలోచన చేస్తున్నది. సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ కంపెనీలపై ప్రభావం చూపనున్నది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా గతేడాది మొదటి నుంచీ వీసాల జారీని గణనీయంగా తగ్గించారని, స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం కంపెనీలకు సృష్టం చేసిందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వెల్లడించారు. ఎకనమిక్ నీడ్స్ టెస్ట్ అంటూ అర్థిక కారణాలను సాకుగా చూపుతూ సింగపూర్ భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు వీసాలను నిరాకరిస్తున్నది. సీఈసీఏ ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఓ భారత అధికారి అన్నారు.













