నియోజకవర్గాల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సృష్టం చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 170(3)ని సవరించే వరకూ తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపు సాధ్యంకాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ జి.ఆహిర్ లోక్‌సభలో ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు ఇప్పట్లో జరగదంటూ ప్రసారమాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ విషయమై హుటహుటిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్యే సీట్ల పెంపునకు అవసరమైన సవరణలను సూచించేందుకు కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధంచేస్తోందని చెప్పారు. హన్స్‌రాజు ప్రకటనపై స్పందిస్తూ అందుబాటులో ఉన్న సమచారం మేరకు ఆయన అలా చెప్పి ఉంటారని పేర్కొన్నారు.













