2018 కల్లా రామమందిరం నిర్మించి తీరుతాం
2018 కల్లా అయోధ్య రామాలయాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి పేర్కొన్నారు. చర్చల ద్వారా రామాలయ వివాదం పరిష్కారం కాని పక్షంలో పార్లమెంట్లో చట్టం చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది రాజ్యసభలో తమకు పూర్తి మెజారిటీ వస్తుందని, అప్పుడు బిల్లు ప్రవేశపెట్టడం కష్టమేమీ కాదని అన్నారు. కోర్టు బయట పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. సరయు నది ఒడ్డున మసీదు నిర్మించడమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మసీదును అక్రమంగా కూల్చారని, దీనిపై కేసు నడుస్తోందని అన్నారు. మసీదు అక్కడే నిర్మించాలనే నియమం ఏమీ లేదని, నమాజ్ ఎక్కడైనా చదువుకోవచ్చని అన్నారు. సరయు నది ఒడ్డున మసీదు నిర్మాణానికి ఆఫరిస్తున్నామని, తాము ఇక్కడ రామమందిరం నిర్మించుకుంటామని పేర్కొన్నారు.













