హంతకులు ఎవరో కాదు.. బంధువులే : వైఎస్ షర్మిల
అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భగా సీఎం జగన్పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతాయేనని తెలిపారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. హంతకులు ఎవరో కాదు, బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? ఇవాళ్టి వరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైసీపీ కోసమే పనిచేశారు. సాక్షిలో పైన వైఎస్ ఫోటో, కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్నా అద్దం ముందు నిల్చొని మిమ్మిల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? ఆయన వారసుడిగా మీరేం చేశారు అని షర్మిల నిలదీశారు.













