పవన్ పై ఎటాక్….
పవన్ వారాహియాత్రపై వైసీపీ ఫోకస్ పెట్టింది. నేరుగా తమ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పవన్ ప్రసంగాలు చేస్తుండడంతో.. కౌంటర్ వార్ కొనసాగిస్తోంది. పేర్నినానితో మొదలు పెట్టి, మంత్రులు అంబటి, బొత్స, ఎమ్మెల్యే కొడాలి నాని సహా పలువురు ఫ్యాన్ పార్టీ నేతలు.. పవన్ పై నిప్పులు చెరుగుతున్నారు. పవన్ దత్తపుత్రుడు అంటూ.. చంద్రబాబు ఆదేశాలు, స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నాడని ప్రచారం తీవ్రం చేశారు.
ఇదే సమయంలో తాను గెలవనని తెలిసి యుద్ధం చేస్తున్నానన్న పవన్ ప్రకటన.. వైసీపీకి అతిపెద్ద ఆయుధాన్నిచ్చిందని చెప్పొచ్చు. అంటే పవన్ కు తాను గెలవనని తెలుసంటూ.. వెంటనే వైసీపీ ఐటీ విభాగం ప్రచారం మొదలుపెట్టేసింది. పవన్ పై అభిమానులతోపాటు జనసైనికులకు అనుమానం కలిగేలా ప్రచారం చేస్తోంది. పవన్ పై భ్రమలు తొలిగాయా అన్నట్లుగా ట్వీట్లు ఊపందుకున్నాయి.
వైసీపీ నేతలు బూతుపురాణాలు విప్పినప్పుడు ఏ విజ్ఞుడికి ఎలాంటి సమస్య రాలేదు. కానీ పవన్ నారతీస్తా, చీరేస్తా అంటూ ప్రసంగించేసరికి… అందరికీ భాష గుర్తొస్తోంది. పవన్ భాషను అదుపులో ఉంచుకోవాలంటూ సెలవిస్తున్నారు. అంతేకాదు..పవన్ చంద్రబాబు మాట కాదు.. చిరంజీవి మాట విను అంటూ మంత్రి రోజా లాంటి నేతలు.. ఉపదేశాలిస్తున్నారు. గెలుపు సంగతి పక్కన పెట్టు ముందు పార్టీ గుర్తు గ్లాస్ పోయిందిగా జాగ్రత్త అంటూ ఇటీవలే పేర్నినాని సహా పలువురు సెటైర్లు వేశారు..
అయితే పవన్ మాత్రం.. తాను అనుకున్న రీతిలోనే ముందుకెళ్తున్నారు. విపక్ష ఓటు చీలనివ్వనంటూ ప్రారంభంలో ప్రకటించిన పవన్.. తర్వాత తనకు సీఎం అవకాశమివ్వాలంటూ అర్థించారు. తాను అధికారంలోకి వస్తే, వైసీపీ అవినీతి పర్వాన్ని తగులబెడతానన్నారు. దాడులకు దిగిన వారందరికీ తగిన శాస్తి చేస్తానన్నారు. అయితే సీఎం అంటూ సంభోదనపై పవన్ క్లారిటీ ఇచ్చారు. తన అభిమానుల కోరిక మేరకు.. సీఎం అవకాశమివ్వాలని అన్నానని స్పష్టం చేశారు. అంటే ఇప్పటికీ పవన్.. పొత్తుల దిశగా తమ ద్వారాలు తెరిచే ఉంచారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.













