Y.S.Viveka: ఇప్పటికైనా వివేకా కేసు ఒక కొలిక్కి వస్తుందా
ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి (Y.S Vivekanand Reddy) హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు 2019 నుంచి నడుస్తూ, అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. జగన్మోహన్ రెడ్డి (Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్లలోనూ నిందితులకు శిక్ష పడలేదు అనే విమర్శలు రావడం గమనార్హం. వివేకా కూతురు సునీతా రెడ్డి (Sunitha Reddy) ఈ విషయం పై అనేకసార్లు బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పేరు ఈ కేసులో గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
అయితే, 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సునీతా రెడ్డి, వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరారు. ఆ తర్వాత విచారణ ప్రక్రియ వేగం పెరిగింది. ఈ నేపథ్యంలోనే దస్తగిరి (Dastagiri ) అప్రూవర్‌గా మారి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. తాను కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, డా. చైతన్య రెడ్డి (Doctor Chaitanya Reddy) తనను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2023 నవంబర్‌లో జైలులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన చైతన్య రెడ్డి, తాను అప్రూవర్‌గా మారి అబద్దాలు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని, ఇందుకు 20 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు.
దస్తగిరి ఫిర్యాదుతో ఈ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చైతన్య రెడ్ తో పాటు కొందరు పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్‌లపై కేసులు పెట్టారు. దస్తగిరిని బెదిరించారనే ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. అంతకుముందే సుప్రీంకోర్టు కూడా చైతన్య రెడ్డికి నోటీసులు పంపింది. ఇదిలా ఉంటే, చైతన్య రెడ్డి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తాను మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు మాత్రమే జైలుకు వెళ్లానని, దస్తగిరిని బెదిరించలేదని అన్నారు. నిజమెంతా అనే దానిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే తాజా పరిణామాలను చూస్తే, ఈ కేసు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.













