Veeraiah Chowdary: మూడు నెలల పన్నాగం.. వీరయ్య చౌదరి హత్య వెనుక అసలు మిస్టరీ..

తెలుగుదేశం పార్టీకి (Telugu Desam party) చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి (Veeraiah Chowdary) హత్య కేసు రోజుకో కొత్త మలుపులు తీసుకుంటోంది. హత్య జరిగి రెండువారాలు గడిచినా ఇప్పటికీ పోలీసులు అసలు సూత్రధారిని పట్టుకోవడంలో తడబడుతున్నారు. దాదాపు మూడు నెలలుగా రహస్యంగా ప్రణాళిక రచించిన తరువాతే ఈ దారుణ ఘటనను నేరస్తులు అమలు చేసినట్లు తాజా సమాచారం చెబుతోంది. హత్యకు ముందు కొన్ని వారాలు పాటు వీరయ్య కదలికలపై గట్టి నిఘా చేసినట్టు తెలిసింది.
ఈ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. హత్య సమయంలో దాడిచేసే ప్రతి కత్తిపోటుకు రూ.2 లక్షలు ఇవ్వబోతున్నామని నిందితులు మధ్య లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి హత్య ఎంత దారుణంగా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. అయితే నేరపూరిత చర్చలన్నీ వెలుగులోకి రావాలంటే అసలు సూత్రధారిని పట్టుకోవడం అత్యంత అవసరమని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన వెంటనే ఇద్దరు ప్రధాన నిందితులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. వీరి కోసం హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో గాలింపు కొనసాగుతోంది.
వీరయ్య చౌదరి రాజకీయ ప్రస్థానంలో ఎదురుగా ఉన్న కొంతమంది వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం కలిసి ఈ హత్యను పన్నినట్టు అనుమానిస్తున్నారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress party) చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితుడు పేకాట ఆటలో మక్కువ చూపుతాడని, వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు అతడిని స్వయంగా తీసుకెళ్లేంత బంధం ఉందని సమాచారం. ఇంకా, జిల్లాలోని ఒక మాజీ ఎమ్మెల్యేతోను అతడి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
నిందితుడి సామాజిక సంబంధాలు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్న అధికారుల వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతడికి మంచి నెట్‌వర్క్ ఉండటమే ఈ కేసు విచారణను మరింత క్లిష్టంగా మారుస్తోంది. హత్య ప్లాన్ సమయంలో నిందితులు త్రోవగుంట(Throvagunta ) ప్రాంతంలో ఒక లాడ్జిలో బస చేసి వీరయ్య దినచర్యను గమనించినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే, అసలు నిందితులు పట్టుబడితేనే వీరయ్య చౌదరి హత్య వెనుక ఉన్న నిజమైన కారణాలు బయట పడతాయని భావిస్తున్నారు.