పాక్ నుంచి విడుదలైన మత్స్యకారులకు 5 లక్షల సాయం
పాకిస్థాన్ చెర నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 మంది మత్స్యకారులు సీఎం క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాయాది దేశంలో వారు పడిన కష్టాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల యోగా క్షేమాలపై అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని వారిని ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
గుజరాత్ తీరం వెంబడి పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది ఆంధ్రా జాలర్లను పాకిస్థాన్ బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. 14 నెలలు పాక్ జైలులో ఉన్న మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు.













