Rayapati Sailaja: ఎపి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (AP) మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా రాయపాటి శైలజ (Rayapati Sailaja) ను నియమించింది. ఉన్నత విద్యావంతురాలైన రాయపాటి శైలజ గత ప్రభుత్వ అన్యాయాలను ఎదురించడంలో ముందు వరుసలో నిలిచారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిరక్షణ ఉద్యమంలో, రైతులు చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమెది కీలకపాత్ర. అందుకే శైలజను మహిళల హక్కులను పరిరక్షించే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. మహిళా కమిషన్‌కు శైలజ లాంటి నాయకురాలి నియామకం ద్వారా మహిళల సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు గోపాలకృష్ణ కుమార్తె శైలజ. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి మహిళా ఐకాస కన్వీనర్‌గా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మూడు రాజధానుల పేరిట వైకాపా చేస్తున్న దురాగతాలను, రాజధాని మహిళల పట్ల అప్పట్లో జగన్ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ వైఖరిని ధైర్యంగా ఎండగట్టారు. మంచి వాగ్ధాటి, విధేయత ఆమెకు పదవి దక్కడానికి కలిసి వచ్చాయి. ఆమెను ఇంతకు ముందు పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ పదవికి ఎంపిక చేశారు. శైలజ ఉన్నత విద్యావంతురాలు. ఆమె బీడీఎస్, ఎమ్‌డీఎస్ పూర్తి చేశారు. ‘మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి వస్తుందని నేను ఊహించ లేదు. నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఈ పదవికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు అంటూ, గత ప్రభుత్వంలో మహిళా కమిషన్‌ను నిర్వీర్యం చేసిందని చెప్పారు. మహిళలకు ఎటువంటి న్యాయం చేయలేదు. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఆమె నియామకంపట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.













