తిరుమలలో అన్యమత ప్రచారం.. వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమత ప్రచారం జరగదని, వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే దుష్ప్రచారం చేశారని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మేరకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరినట్లు తెలిపారు. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం దీన్ని పునరుద్ధరించారన్నారు.
వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సీఎం జగన్ రద్దు చేశారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని కోరారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివేనని అన్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని, పింక్ డైమండ్ మాయం అంశం కోర్టులో ఉందన్నారు. టీటీడీ విషయాలను రాజకీయం చేయడం తగదు అని పేర్కొన్నారు.













