ఎన్డీఏ గూటికి…?
ఈనెల 18న జరగనున్న ఎన్డీఏ సమావేశం.. దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మిత్రపక్షాలను ఓచోట చేర్చేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాల్లో భాగంగా.. సమావేశం ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ సమావేశానికి ఏపీ నుంచి ఏయే పార్టీలకు ఆహ్వానం అందనుంది.. గతంలో ఎన్డీఏ హయాంలోని మిత్రపక్షమైన టీడీపీ హాజరవుతుందా? పొత్తులో కొనసాగుతున్న జనసేనను ఆహ్వానిస్తారా? లేక వైసీపీకి అవకాశమిస్తారా? ఇప్పుడీ అంశమే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
వాజ్ పాయ్ హయాం నుంచి ఎన్డీఏలో నమ్మకమైన భాగస్వామిగా తెలుగుదేశం ఉంది. చాలా సందర్భాల్లో కలిసి పనిచేశారు. అయితే తర్వాతి పరిణామాల్లో టీడీపీ .. ఎన్డీఏకు దూరమైంది. బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అయితే.. ఇటీవలి కాలంలో పరిణామాలు కాస్త మారాయి. ఇటీవలి కాలంలో చంద్రబాబు… ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఆతర్వాత పలుదపాలు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్రమంత్రులతోనూ సమావేశమయ్యారు. దీంతో మళ్లీ టీడీపీ, బీజేపీకి దగ్గరవుతోందని వార్తలు వినవచ్చాయి.
ఈ తరుణంలో ఎన్డీయే సమావేశం జరగనుండడంతో టీడీపీని ఆహ్వానిస్తారా? లేదా అన్న ఆసక్తి .. ఎన్డీఏతో పాటు విపక్షకూటమిలోనూ కనిపిస్తోంది. మరోవైపు మిత్రపక్షం జనసేనకు ఆహ్వానం వస్తుందా..? ఎన్డీఏలో జనసేన చేరుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోడీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల పవన్ కల్యాణ్.. ఎన్డీఏలో చేరే పరిస్థితులున్నట్లు కనిపిస్తోంది.. కానీ ఇప్పుడు ఎన్నికలు రానున్న తరుణంలో టీడీపీతో కలిసి జనసేన వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది.మరి అలాంటప్పుడు ఓపార్టీ కూటమిలో ఉండి, మరోపార్టీ విడిగా ఉంటే… అది సమష్టిపోరాటానికి విఘాతంగా పరిణమించే అవకాశాలున్నాయి.
ఇక వైసీపీ .. బయటి నుంచి మోడీ సర్కార్ కు మద్దతుదారుగా ఉంది. క్లిష్టపరిస్థితుల్లో అనుకూలంగా వ్యవహరించింది. దీంతో ఓ వేళ వైసీపీకి ఆహ్వానం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే వైసీపీ కూటమిలో చేరితే .. జనసేన దూరంగా ఉండే పరిస్థితులున్నాయి. మరోవైపు ఇటీవలే బీజేపీ అగ్రనేతలు సైతం .. వైసీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ అండగా నిలిచే పరిస్థితి ఉండకపోవచ్చని సీఎం జగన్ సైతం .. పార్టీ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. ఈపరిస్థితుల్లో వైసీపీకి ఆహ్వానం ఉంటుందా..? సమావేశం నాటికి ఎలాంటి పరిస్థితులుంటాయో వేచిచూడాలి.













