వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో : లోకేశ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జైలులో బంధించి 50 రోజులైందని, ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడటం సహజమే. చంద్రబాబు చనిపోవాలి, చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో సంబంధం లేని నా తల్లిని కూడా జైలు పంపిస్తామని మహిళా మంత్రి వ్యాఖ్యానించారు. నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా? అని ప్రశ్నించారు.
స్కిల్, ఫైబర్‌నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా? పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైన చూపారా? ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. చంద్రబాబును బయటకు రానీయకుండా లాయర్ ఫీజుకు రూ.పదేసి కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోంది. వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. సైకో జగన్‌ను వదిలిపెట్టం. ప్రజల తరపున పోరాడుతాం అని స్పష్టం చేశారు.













