విశాఖలో ఫింటెక్ వ్యాలీతో సహా ఐటీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బోద్ ట్రీ సాప్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విశాఖపట్నం ఫింటెక్ వ్యాలీతో సహా ఐటి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి బోద్ ట్రీ కంపెనీ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ వివరించారు. జిఎస్టీ సర్వీసెస్, అకౌంటింగ్, బిల్లింగ్, సాప్ట్వేర్ ప్రొడక్టు డెవలప్మెంట్తో విశాఖపట్నం ఫింటెక్ వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించడానికి బోద్ ట్రీ అంగీకరించింది. 200 మందితో కార్యకలాపాలు ప్రారంభించి రానున్న అయిదు ఏళ్లలో 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అని మంత్రికి బోద్ ట్రీ ప్రతినిధులు వివరించారు. విశాఖలో రానున్న ఐదు సంవత్సరాల్లో 50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే విశాఖపట్నంలోని ఫింటెక్ వ్యాలీలో 200 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభించడానికి కావల్సిన మౌలిక వసతులు, అనుమతులు వెంటనే కల్పిస్తాం అని మంత్రి బోద్ ట్రీ కంపెనీ ప్రతినిధులకు చెప్పారు.













