పార్టీ కీలక నేతను కోల్పోయింది : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. నెల్లూరులోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై నగరంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. కన్నీటీ వీడ్కోలు పలకటానికి భారీ జనసందోహం తరలివచ్చింది. వివేకాకు శ్రద్ధాంజలి ఘటించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు వచ్చారు. ఆనం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పార్టీ ఒక కీలక నేతను కోల్పోయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆనం కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆనం వివేకానందరెడ్డి సోదరులు రామనారాయణరెడ్డి, జయకుమార్‌రెడ్డి, విజయకుమార్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు మాట్లాడారు.













