కాపు పాలిటిక్స్…
వారాహి పాదయాత్రతో చెలరేగిపోతున్న పవన్ పై ఊహించినట్లుగానే వైసీపీ తమ అస్త్రాన్ని ప్రయోగించింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కు లేఖరాశారు. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసిపోటీ చేస్తాయని తరచూ అంటున్న పవన్.. ఇప్పుడు నన్ను సీఎంను చేయండి అనడమేంటని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమన్నారు.
అంతే కాదు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని ముద్రగడ లేఖలో అన్నారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలన్నారు. మాటలు కాదు సత్తా చూపడానికి ముందుకు రావాలని సవాల ్ విసిరారు. కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదన్నారు.
అంతే కాదు…పవన్ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారని ఎంతమందిని ఇప్పటివరకూ చెప్పుతో కొట్టారో సెలవివ్వాలని ముద్రగడ సెటైర్ వేశారు.దీంతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ నేరుగా రంగంలోకి దిగినట్లైంది. ఇది వైసీపీ కాపునేతలకు, మరీ ముఖ్యంగా ద్వారంపూడి అనుచరులకు ఆనందం కలిగిస్తోంది. దీంతో పవన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు సరైన ఆయుధం దొరికిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది.
అయితే ముద్రగడ లేఖపై జనసైనికులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ముద్రగడ వైఖరిపై పోస్టులు పెడుతున్నారు. మీకళ్లను ఏమైనా రెడ్డిగారి పంచె సందుల్లో పెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్ కు ముద్రగడ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో చెప్పాలన్నారు. వైసీపీ పాలనలో కాపులకు అన్యాయం జరుగుతున్న సమయంలో ప్రశ్నించేందుకు ముందుకు రాని ముద్రగడ.. వాటిని ఎండగడుతున్న పవన్ ను ప్రశ్నించడమేంటని నిలదస్తున్నారు. దీంతో రానున్న కాలంలో కాపు రాజకీయాలు పీక్స్ కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.













