పది ఫలితాల వేళ మనోధైర్యం ముఖ్యం.. వైఫల్యాలను విజయాలుగా మలుచుకోండిలా!
Exam Results: విద్యార్థి జీవితంలో పరీక్షలు అత్యంత కీలకమైన ఘట్టం. వీటి కోసం ఏడాదంతా శ్రమించినప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా లేదా పరీక్ష తప్పినా చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, మార్కులు తక్కువ వచ్చాయని కుంగిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష ఫలితాలే జీవితం కాదని, ఇక్కడితో జీవన గమనం ఆగిపోదని విద్యార్థులు గుర్తించాలి. పది, ఇంటర్ పరీక్షలు తప్పినప్పటికీ, తిరిగి రాసి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని..
మార్కులను కేవలం ఒక కొలమానంగా చూడవద్దని, ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ మార్కులు వస్తే ఇతరులు హేళన చేస్తారనే భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, ఇవి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలిస్తాయని హెచ్చరిస్తున్నారు. అపజయాలను ఎదుర్కొని ముందడుగు వేసేలా కుటుంబ సభ్యులు, స్నేహితులు విద్యార్థులకు మనోధైర్యం అందించాలని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కలెక్టర్ నిశాంతి అనుభవాలు..
ఈ సందర్భంగా అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన తాను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఐఏఎస్ సాధించానని తెలిపారు. వైఫల్యాలే గెలుపు వైపు నడిపిస్తాయని, విమర్శలు ఎదురైనప్పుడు ఓర్పుతో వ్యవహరించాలని ఆమె సూచించారు. ఓటమి వద్దే ఆగిపోతే విజయం రుచి చూడలేమని, కొద్దిపాటి అపజయాలకే కుంగిపోవద్దని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.
విద్యార్థులకు దిశానిర్దేశం..
మంచి మార్కులు, ర్యాంకులు మాత్రమే లక్ష్యం చేరేందుకు కొలమానం కాదని, ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి నిలబడటమే అసలైన విజయమని కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే అవకాశాలను అందిపుచ్చుకునేలా సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆమె విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.








