ఏపీలో సైకిల్….. తెలంగాణలో కారు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీడీపీకే పట్టం కట్టబోతున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. తిరుపతిలో తన ఆర్జీవీ ఫ్లాష్ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్‌సభ ఫలితాలతో పాటు జాతీయస్థాయిలో అంచనాలు చెప్పారు. రాజధాని ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతోంది. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం మారితే చాలా నష్టం అనే ఆలోచనతో చాలామంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. మహిళలు టీడీపీ వైపు నిలిచారని పేర్కొన్నారు. ప్రతిపక్ష వైకాపా గణనీయమైన ప్రజామద్దతులో అధికార పక్షానికి మంచి పోటీనిచ్చిందని, అయినా ఆ పార్టీ ప్రతిపక్షంతోనే ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. మూడోస్థానంలో జనసేన ఉండబోతోందని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు పూర్తిస్థాయి సీట్లు రావొచ్చు. ఎంఐఎంకు వచ్చే ఒక సీటు లాంఛనమే. మా సర్వే తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఫలించలేదో 23వ తేదీ తర్వాతే చెబుతాను. కేసీఆర్ రాష్ట్ర ప్రత్యేకహోదా డిమాండ్‌కు మద్దతు ఇస్తాను అని చెప్పడం అభినందనీయం. ఇరు రాష్ట్రాలోని పార్టీలు ఒక్కటై 42 సీట్లను ఒకే చోటకు చేర్చి కేంద్రంలోని ప్రభుత్వానికి ఐక్యతగా మద్దతునిస్తే అన్ని పనులు జరుగుతాయి అని అన్నారు.













