షర్మిల వెనక కేవీపీ…?
వైఎస్ షర్మిల.. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడం వెనక ఎవరున్నారు..? ఇప్పుడిదే అంశం.. వైసీపీని వేధిస్తోంది. దీంతో షర్మిలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. షర్మిల ఎవరెవరిని కలుస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారనే అంశాలపై ఆరా తీస్తోంది. షర్మిల విజయవాడ పర్యటనపై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోకస్ చేశారు. షర్మిల వద్దకు ఎవరు వెళ్తున్నారనే అంశానికి సంబంధించి డేటా తీస్తున్నారు.
సీఎం జగన్ తో రాజకీయంగా విభేదించిన నేతలు.. షర్మిలకు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న నేతలతోనూ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ను వ్యతిరేకించే నేతలు, బడుగు బలహీన వర్గాల నేతలను పార్టీలో చేర్చుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్లాలని హై కమాండ్ ఆమె దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా వైఎస్సార్ బతికున్నప్పుడు ఆయన ఆత్మగా పేరుగాంచిన కేవీపీ రామచంద్రరావు… ఇప్పుడు పార్టీలో చక్రం తిప్పుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తన పలుకుబడితో .. సమర్థత ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వైఎస్ఆర్తో కలిసి నడిచిన నేతలను కేవీపీ తీసుకొస్తున్నారు. ఇప్పటి తరం నేతలతో షర్మిల మాట్లాడుతున్నట్లు సమాచారం. పాత, కొత్త తరం నేతలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో షర్మిల బిజీగా ఉన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని షర్మిల వర్గం నేతలు చెబుతున్నారు. దీనికి తోడు ఈనెల 23 నుంచి ఇచ్చాపురం నుంచి షర్మిల ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం సందర్భంగా పలువురు వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పార్టీలో జాయినయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వైసీపీకి ఓరకంగా చెప్పాలంటే మింగుడుపడని అంశమే అని చెప్పొచ్చు. ఎందుకంటే … వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను.. ఇప్పుడు కాంగ్రెస్ ఆకర్షిస్తుందని ఫ్యాన్ పార్టీలో చర్చ నడుస్తోంది.













