వాళ్లిద్దరికీ భారతరత్న ఇవ్వాలి : కొడాలి నాని
ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన ముఖ్యమంత్రి జగన్కు పాదాభివందనాలు చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం అని అన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలన్నారు.
గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ నాయకులు అల్లరి చేశారు. క్యాసినోకు రూ.500 కోట్లు వచ్చాయంటున్నారు. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలన్నారు. గుడివాడలో నన్ను ఓడిరచలేక లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. గుడివాడలో 3 రోజుల క్యాసినోకు 362 రోజులు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం సమయమిచ్చా ఇక వాళ్ల ఇష్టం అని విమర్శించారు.













