జనంలోకి ఇంకెప్పుడు వెళ్తావ్ పవన్..?
దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలూ జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు అన్ని పార్టీలూ సమరశంఖం పూరించేశాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధం అని అధికార వైసీపీ ప్రకటించింది. ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా చాలాకాలంగా జనంలోనే ఉంది. రా కదలిరా పేరిట ఆ పార్టీ విస్తృతంగా పర్యటిస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటికే జనంలో కనిపించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నా పవన్ రాకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి.
ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది. పలువురు సిట్టింగులకు మొండిచేయి చూపిన ఆ పార్టీ అధినేత జగన్ కొత్త ముఖాలకు చోటు కల్పిస్తున్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను మారుస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. ఇన్నాళ్లూ ప్రభుత్వంపైనే ఫోకస్ పెట్టిన జగన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. తాజాగా భీమిలిలో తొలి భారీ బహిరంగసభను నిర్వహించింది వైసీపీ. సిద్ధం పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగన్… విపక్షాలతో ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ప్రజలే తన సారథులని.. మరోసారి వైసీపీని ఆశీర్వదించాలని కోరారు.
ఇక టీడీపీ కూడా ప్రతిరోజూ జనంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరుతో ప్రతిరోజూ రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగసభలకు ఆ పార్టీ ప్లాన్ వేసింది. మరోవైపు లోకేశ్, భువనేశ్వరి కూడా తమదైన శైలిలో వివిధ కార్యక్రమాల పేరుతో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కేడర్ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఎలాగైనా జగన్ ను ఓడించడం ఖాయమని ధీమా ప్రదర్శిస్తోంది.
అయితే జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం, హైదరాబాద్, మంగళగిరి దాటి బయటకు రావట్లేదు. అడపాదడపా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాత్రమే పవన్ కనిపిస్తున్నారు. అక్కడ సమీక్షల అనంతరం మళ్లీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఎవరైనా పార్టీలో చేరే సందర్భం ఉంటేనే ఆయన మంగళగిరిలో కనిపిస్తున్నారు. ఇంకెప్పుడు జనాల్లోకి వెళ్తారనేది ఆ పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదు. ఇప్పటికీ చాలా మంది నేతలు తమకు టికెట్ వస్తుందో రాదో అన టెన్షన్ పడుతున్నారు. కీలక నేతలకు కూడా పవన్ కల్యాణ్ హామీ ఇవ్వలేదు. పనిచేసుకోండని చెప్పలేదు. దీంతో కీలక నేతలు కూడా అధినేత ఆదేశాలకోసం ఎదురు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో అంతంతమాత్రంగానే కేడర్ ఉన్న జనసేన.. జనంలోకి వెళ్లినప్పుడే బలపడుతుంది. కానీ అధినేత హైదరాబాద్ కే పరిమితం కావడంతో పార్టీ పరిస్థితి ఏంటో అర్థంకాక కేడర్ దిగులు చెందుతోంది.













