ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎన్ఆర్ఐల సాధికారతకు చేయూత
ప్రవాసాంధ్రుల అభివృద్ధి, సాధికారతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఎదుగుదలకు అవసరమైన చేయూతను అందించేందుకు ఆయా దేశాల్లో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) తరపున ప్రత్యేక సమన్వయకర్తలను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వారి ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవాసాంధ్రులందరినీ మాతృభూమితో అనుసంధానించేలా కార్యక్రమాలు అమలు చేయాలని, క్రమం తప్పకుండా విదేశాల్లోని తెలుగు వారందరితోనూ సమావేశాలు పెట్టాలని అన్నారు.
ఎన్ఆర్ఐ సాధికారితపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీఎన్ఆర్టీ ఐకాన్ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీఎన్ఆర్టీ కోటా కింద ఎన్ఆర్ఐలకు ఆదివారం మినహా రోజు 10 టీటీడీ దర్శన టికెట్లు ఇచ్చేందుకు సమ్మతించారు. ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ కార్యాలయంలోని ఎన్ఆర్ఐ సెల్‌ను మరింత పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు.













