ఘనంగా గోదావరి ఫెస్టివల్
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్లో ఏపీ టూరిజం, కల్చరల్ శాఖ ఆధ్వర్యంలో గోదావరి ఫెస్టివల్ కనులపండువగా ప్రారంభమైంది. భారీ సెట్టింగులు, నదిపై తేలియాడే వేదికలతో ఘాట్ కళకళలాడింది. 31 మంది పురోహితులు, నదీమతల్లికి హారతి ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరం కూచిపూడి కళాకారిణి హరిణీప్రియ నృత్య ప్రదర్శనతో గోదావరి ఫెస్టివల్ నృత్యాలు ప్రారంభమమయ్యాయి.
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ తన బృందంతో చేసిన నాట్య ప్రదర్శన అమరావతి ప్రాశస్త్యాన్ని గోదావరి సాక్షిగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి డ్రమ్స్ వాయిద్యంతో కోటిలింగాల ఘాట్ మార్మోగింది. లంకల్లోంచి బాణసంచాల పేలుళ్లు, నింగిలో ఆకాశ దీపాలు అద్భుతాన్ని ఆవిష్కరించాయి. గోదావరి ఫెస్టివల్ ఆద్యంతం తొలి రోజు ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన ప్రారంభమైన ఈ ఉత్సవానికి ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.













