పిఠాపురంలో ఫ్లెక్సీ రచ్చ, టీడీపీ వర్సెస్ జనసేన..!
కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతంలోనే పలుమార్లు విభేదాలు పొడసూపిన టీడీపీ-జనసేన నేతల మధ్య, తాజాగా ఫ్లెక్సీల విషయంలో తలెత్తిన వివాదం తోపులాట వరకు దారితీసింది. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఫోటో లేకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా సీఎం ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయంలో స్థానిక జనసేన నేతలతో ఆయన వాగ్వాదానికి దిగారు. వర్మ వ్యాఖ్యలపై జనసేన నేత తుమ్మల బాబు గట్టిగా స్పందించారు. మాట మాట పెరగడంతో అక్కడే ఉన్న జనసేన(Janasena) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఒక్కసారిగా వర్మపైకి దూసుకెళ్లారు. నేతల మధ్య వాగ్వాదం జరుగుతుండగానే ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చూస్తుండగానే తోపులాట పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
కార్యకర్తలను చెదరగొట్టి నేతలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే, పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అంతా కలిసి పనిచేశామని, కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే ఇలాంటి గొడవలు రావడం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా కూటమి పాలన సాగుతుంటే, పిఠాపురంలో మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ఫ్లెక్సీ వివాదం సాకుతో బయటపడ్డ ఈ విభేదాలు అధిష్టానం వరకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఘటనపై అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








