కమిటీలతో స్పీడ్ పెంచిన టీడీపీ.. తదుపరి టార్గెట్ ఏమిటో?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ (TDP) తన వ్యూహాలను క్రమబద్ధంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పార్టీ జాతీయ ,రాష్ట్ర కమిటీలను తాజాగా ప్రకటించడం ద్వారా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ప్రక్రియలో నారా లోకేష్ (Nara Lokesh)కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే గత మహానాడు (Mahanadu) సమయంలో లోకేష్‌కు ఈ బాధ్యతలు ఇవ్వవచ్చని చర్చలు జరిగినా, ఈసారి మహానాడు ముందుగానే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. దీంతో పార్టీ వ్యవహారాలపై లోకేష్‌కు మరింత పట్టు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈసారి మహానాడు సమావేశంలో ఆయన కొత్త హోదాలో పాల్గొనడం ద్వారా పార్టీపై తన ప్రభావాన్ని మరింత పెంచుకునే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
ఇక జూన్ నెలలో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుండటం కూడా కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ (Cabinet Expansion)పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సరైన సమయం చూసుకుని ఈ మార్పులు చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కమిటీలలో చేసిన మార్పుల మాదిరిగానే, ప్రభుత్వం లో కూడా కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కూటమి మంత్రివర్గంలో ఇప్పటికే కొత్తవారికి కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ, రాబోయే మార్పుల్లో మరింత చురుకుగా పనిచేసే నాయకులను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రచారం చేయగలిగే నాయకులను ఎంపిక చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్ మంత్రులకు మార్పులు జరిగే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా యువతకు, కొత్తవారికి అవకాశాలు పెరుగుతున్నాయని అందరూ భావిస్తున్నారు. లోకేష్ తనదైన శైలిలో పార్టీపై ముద్ర వేసిన నేపథ్యంలో, ప్రభుత్వంలో కూడా మార్పులు జరిగితే తన దృక్పథాన్ని ప్రతిబింబించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.
అయితే ఈ మంత్రి వర్గ విస్తరణ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుందన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. చిన్న మార్పులు మాత్రమే చేసి ముగిస్తారా, లేక పెద్ద ఎత్తున వ్యూహరచన చేస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీసుకున్న నిర్ణయాల మాదిరిగా మొత్తం మంత్రివర్గాన్ని మార్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. పరిమిత మార్పులతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, పార్టీ కమిటీల ప్రకటనతో టీడీపీ కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి మంత్రి వర్గ విస్తరణపై నిలిచింది. ఈ మార్పులు ఎలా ఉంటాయి, ఎప్పుడు జరుగుతాయి అన్నదే రాబోయే రోజుల్లో ఆసక్తికర అంశంగా మారనుంది.
ఇవి కూడా చదవండి








