మాండౌస్ ప్రభావం… ఏపీలో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను తమిళనాడులోని మహబలిపురం వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది తీవ్ర వాయుగుండంగా బలహీన పడినట్టు ఐఎండీ తెలిపింది. క్రమంగా ఇది మరింతగా బలహీన పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కేవీబీపురం మండలం శ్రీకాళహస్తి` పిచ్చటూరు రహదారిపై వరద ప్రవహిస్తోంది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చెట్లు విరిగి పడ్డాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. బాలాయపల్లి మండలం కడగుంట వంతెనపై కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దక్కిలి మండలం లింగాసముద్రం రహదారిపై విరిగిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. కేవీబీపురం మండలం కాలంగి రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి పడుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా కేవీబీపురం మండలం రాజులకండ్రిగ వద్ద కాజ్వే కొట్టుకుపోయింది. తుపాను ప్రభావంతో తిరుపతిలో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలయమం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.













