2019లో కాదు ..శాశ్వతంగా అధికారం మాదే : చంద్రబాబు
2019లోనే కాదు రాష్ట్రంలో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షించేవారు తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని సమర్థించాలని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం తర్వాత కొందరు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు మీ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనా అన్న ప్రశ్నకు, ఆయన నేరుగా బదులివ్వకుండా ప్రభుత్వానికి సహకరించేవారందరి మద్దతు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వముంటేనె పెట్టుబడులు వస్తాయి. ప్రతి రోజూ రాజకీయ అస్థిరత ఉంటే ఎవరూ ముందుకురారు. రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్న అనుమానం వచ్చిన కూడా ఎవరూ ముందడుగేయరు. అభివృద్ధి కూడా అనుకున్నంత జరగదు. మా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది అని తెలిపారు.
నంద్యాల ప్రజలు చూపిన ఆదరణ అపూర్వం. అది రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ప్రభుత్వం చేసిన పనులు చూశాకే ప్రజలు మద్దతిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా విపక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఒకపక్క వారితో పోరాటం చేస్తూనే, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.













