జయహో బిసి సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
బిసిలు వెన్నంటి ఉన్నంతవరకు టిడిపిని ఏ శక్తి ఏమీ చేయలేవు
బీసీలు-టీడీపీ అనుంబంధానికి 36 సంవత్సరాలు
బిసిల రుణం తీర్చుకునేందుకే నాలుగున్నరేళ్లలో రూ.40వేల కోట్ల నిధులు
హాజరైన 32 బిసి కులాల ప్రతినిధులు.
రాష్ట్రవ్యాప్తంగా 32 బీసీ సంఘాలు ‘జయహో బీసీ’ సన్నాహక సమావేశానికి రావడం సంతోషం. బీసీల అభివృద్ధికి ‘మేధో మథనం’ జరగాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించాం.
36ఏళ్లుగా టిడిపికి బిసిలు జై కొట్టారు. కష్టాలలో, నష్టాలలో బిసిలు టిడిపి వెన్నంటే ఉన్నారు. అందుకే రాజమండ్రిలో ‘జయహో బిసి’ సదస్సు. బిసిల రుణం తీర్చుకునేందుకే నాలుగున్నరేళ్లలో రూ.40వేల కోట్ల నిధులు.
తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలంటే టీడీపీ. బిసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టిడిపినే. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు టిడిపి ఘనతే. ఆ రిజర్వేషన్ల వల్లే ఈ రోజు అన్ని పార్టీలలో బిసి నాయకత్వం ఎదిగింది.
వెనుకబడిన వర్గాలే టీడీపీకి వెన్నుముక. వెనుకబడిన వర్గాలు అండ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఏ శక్తి ఏం చేయలేదు. మొట్టమొదటిసారిగా బీసీలకు గుర్తింపుతీసుకువచ్చింది ఎన్టీ రామారావు. వెనుకబడిన వర్గాలను ఆదరించి, గుర్తింపు తీసుకువచ్చిన పార్టీ టీడీపీ. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని ఎన్టీ రామారావు అంటే, పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయం. పేదల్లో ఎక్కువ మంది బీసీలే.. అందుకే బీసీల ఉన్నతికి కృషి చేస్తూ వచ్చాం. కులవృత్తులు, చేతివృత్తులతో ఆర్ధికంగా నిలదొక్కుకోని బీసీల కోసం ఆదరణ పథకం ప్రవేశపెట్టాం.
మిగిలిన పార్టీలు ఎప్పుడూ బీసీల గురించి ఇంతగా శ్రద్ధ తీసుకోవు, మాట్లాడవు. గత పాలకులు బీసీలకు ఫెడరేషన్లు పెట్టారే కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అవమానించారు. టిడిపి వాళ్లనే కక్షతో గత ప్రభుత్వాలు బిసిలకు ఏమీ చేయలేదు. బిసిలకు ఏమైనా చేస్తే టిడిపి బలపడుతుందని చేయలేదు. బిసి ఫెడరేషన్లకు కుర్చీలు,బెంచీలు కూడా ఇవ్వలేదు. టిడిపి బలపడుతుందనే బిసిలను అణిచేశారు.
బిసిలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. బిసిలు వెన్నంటి ఉన్నంతవరకు టిడిపిని ఏ శక్తి ఏమీ చేయలేవు. టీడీపీకి అండగా ఉండే వారి రుణం వచ్చే ఐదేళ్లలో తీర్చుకుంటాం.
పేదల పట్ల ప్రేమ, మనసు ఉండబట్టే.. ఆర్ధికంగా లోటులో ఉన్నా పెన్షన్లు 10 రెట్లు పెంచాం. మొత్తం 54లక్షల మంది పించన్ పొందేవారిలో 25లక్షల మందిపైగా బిసిలే. పసుపు-కుంకుమ కింద స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇప్పటికే రూ.10 వేల చొప్పున ఇచ్చాం. మరో రూ.10వేలు ఈ ఫిబ్రవరిలో ఇస్తున్నాం. ఒక్కో మహిళకు రూ.20వేలు అందజేసినట్లు అవుతుంది. మహిళలకు మొత్తం రూ.22వేల కోట్లు ఇస్తున్నాం. ఇందులో సగం మందిపైగా వెనుకబడిన తరగతికి చెందిన(బీసి) మహిళలే ఉన్నారు.
చంద్రన్న బీమా, పెళ్లికానుక వంటి సంక్షేమ పథకాలతో పాటు, అన్న క్యాంటిన్ల ద్వారా పేదలను ఆదుకుంటున్నాం. గర్భిణీలకు సీమంతాలు చేస్తున్నాం, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.5లక్షలు ఇస్తాం. ఖర్చులు తగ్గించడం ద్వారా రాబడి పెంచడంలో తోడ్పాటు ఇస్తున్నాం. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగే వరకు, బిసి కుటుంబాల ఆదాయం పెరిగే వరకు మేం అండగా ఉంటాం.
చేతివృత్తులంటే అవన్నీ సేవలే. రజకులది ఒక సేవ అయితే నాయీ బ్రాహ్మణులది ఇంకో సేవ. శాలివాహనులది మరో సేవ. విశ్వబ్రాహ్మణులది ఇంకో సేవ. సమాజానికి నిజమైన సేవకులు బిసిలు. వారి సేవలకు తగిన గుర్తింపు,గౌరవం ఉండాలి.
చేతివృత్తులే బీసిల ఆస్తి. చేతివృత్తులే బిసిల వారసత్వ సంపద. ఆధునీకరణ వల్ల చేతివృత్తులు దెబ్బతిన్నాయి. అందుకే ఆదరణ పథకం తెచ్చాం. ఆదరణ ద్వారా ఆధునిక పనిముట్లు ఇచ్చాం. అక్కసుతోనే వైఎస్ ఆదరణ పథకం రద్దు చేశారు. 2014లో టిడిపి గెలవగానే ఆదరణ 2 ప్రారంభించాం. 90% సబ్సిడీపై ఆధునిక పనిముట్లు ఇస్తున్నాం.
టిడిపి రాకముందు బిసిలు అనుభవించిన కష్టాలను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. భూములు లేక, రాబడి లేక, ఇతర ప్రాంతాలకు వలసలు పోయి బీసిలు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. టిడిపి ఆవిర్భావం తరువాతే బిసిల కష్టాలు గట్టెక్కాయి. చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందితే, వారి కష్టం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్ల పంపిణీ ద్వారా చేతివృత్తుల వారి కష్టాలను తీర్చాం. ఆరు వందల రకాలకు పైగా ఆధునిక పనిముట్లను ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చి బీసీలకు అందించాం. ప్రపంచంలో ఉన్న ఆధునిక పనిముట్లన్నీ తెప్పిస్తాం. మన చేతివృత్తుల వారికి అందుబాటులో ఉంచుతాం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. కుటుంబ ఆదాయాలను పెంచుకోవాలి.
అత్యంత వెనుకబడిన తరగతులకు సైతం ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత మాది. 11 ఫెడరేషన్లకు గతంలో గుర్తింపు కూడా ఉండేదికాదు, కానీ మేం వచ్చాక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశాం. ఎంబిసీలకు ప్రత్యేక కార్పోరేషన్ పెట్టింది టిడిపినే. రూ.100కోట్ల బడ్జెట్ ఎంబిసిలకు కేటాయించాం.
175 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. అక్కడ తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకింగ్ బాధ్యతను మేం తీసుకునే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. స్థానిక మార్కెట్లో విక్రయించుకోవడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌కు మీ ఉత్పత్తులు అందేలా చేస్తాం. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనేది నా ఆశయం.
అధికారం ఉందనే గర్వం, ఏమరుపాటు నాకు లేదు. ఎప్పుడూ మంచి పనులు చేయాలనే చూస్తుంటాను. జీవితాంతం వెనుకబడిన వర్గాలకు రుణపడివుంటా. నా జీవితం ఉన్నంతవరకు వెనుకబడిన వర్గాలకు నేను రుణపడి ఉంటాను.
నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే. టీడీపీకి ఇప్పటికి ఎక్కువ ఓట్లు వేసేది బీసీలే. టీడీపీకి అన్నిసార్లు ఓట్లు వేసింది వెనుకబడిన వర్గాలే.టిడిపి ఈ రోజు అధికారంలో ఉండటానికి కారణం బిసిలే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అండగా ఉంది బిసిలే. కొన్నివర్గాలు కొన్ని సార్లే టీడీపీకి ఓటు వేశాయి.. కానీ బీసీలు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు.
బిసిలను ఎప్పటికీ మరిచిపోవడం జరగదు. బిసిలను మరిచిపోతే నన్ను నేను మరిచిపోయినట్లే. ప్రతిరోజూ బీసీలను గుర్తు తెచ్చుకుంటాను. వెనుబడిన వర్గాలు ఐక్యమత్యాన్ని చాటాలి. 138కులాలుగా విడిపోతే బలహీన పడతారు. 138కులాలు సంఘటితమైతే బలమైన శక్తి. బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి, ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బీసీలు బలోపేతం కావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అందరికంటే బీసీ విద్యార్ధులను ఉన్నతస్థానానికి తీసుకువెళ్లే బాధ్యతను నేను తీసుకుంటాను.
సమర్ధవంతమైన నాయకత్వం బీసీల్లో రావాలి. సమర్ధత ఉన్నవారికి ప్రోత్సాహం అందించే బాధ్యత నాది. అవసరమైతే ఎంఎస్ఎంఈల్లో రిజర్వేషన్లు అమలు చేసి బీసీలు పరిశ్రమలు నెలకొల్పేలా చూస్తాం. సంచార జాతులను ఆదుకునేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చేందుకు ఆలోచిస్తున్నాం.
బీసీ గ్రూపుల్లో మార్పులు చేర్పులు, రిజర్వేషన్ల శాతంపై చర్చ జరగాలి. ఐక్యమత్యంతో పాటు, ఒకరితో ఒకరు పోటీపడే తత్వం బీసీ కులాల్లో ఉండాలి. జనాభా దామాషా, పేదరికం ప్రాతిపదికన సంక్షేమ లబ్ది చేకూరాలి.
బీసీలే నా హైకమాండ్, మీరు ఏం చెబితే అదే చేస్తాను. బీసీల డిమాండ్లు అన్నింటినీ నేను పరిశీలిస్తాను. బీసిలలో ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెంపొందాలి. కొత్త రాష్ట్రం నిర్మాణంలో బిసిలంతా శక్తివంచన లేకుండా తోడ్పాటు అందించాలి. నవ్యాంధ్రప్రదేశ్ కోసం విజన్ 2022, 2029, 2050 రూపొందించుకున్నాం.
విభజన చట్టం అమలులో అన్యాయం జరిగిందని మనం నరేంద్రమోదీపై పోరాడుతున్నాం. బీజేపీ నాయకులు ఆడే ఆటలు తెలుగు ప్రజల తెలివితేటల ముందు సాగవు. దేశంలో అన్ని పార్టీలది ఒకదారి అయితే జగన్, కేసీఆర్‌ది మరో దారి.మోదీని గెలిపించేందుకు జగన్, కేసీఆర్ తపన పడుతున్నారు. నరేంద్రమోదీ ఓడితేనే నవ్యాంధ్రప్రదేశ్ గెలుస్తుంది. కోడికత్తి పార్టీతో జట్టుకట్టి రాష్ట్రానికి అన్యాయం చేయాలని హైదరాబాద్ మోదీ ప్రయత్నిస్తున్నారు.
తమకు న్యాయం టీడీపీతోనే జరుగుతుందని బీసీలు పెట్టుకున్న నమ్మకం నా బాధ్యతను మరింత పెంచింది. బీసీలు-టీడీపీ అనుంబంధానికి 36 సంవత్సరాలు. ఈనెల 27న జరిగే జయహో బీసీ సదస్సుకు బీసీలు తరలివచ్చి విజయవంతం చేయాలి,
మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం:
రాష్ట్రంలోని 139 బలహీన వర్గాల కులాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్నరేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు. బీసీలకు ఇంకా ఏ విధంగా సహాయం చేయొచ్చు, వారి ఉన్నతికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగానే వాడుకున్నారు.
టీడీపీ ఏర్పాటైన తర్వాత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు అండదండగా ఉండి ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగేలా చూశారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు జరిగిన బీసీల అభివృద్ధికి మించి ఈ నాలుగున్నరేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధించేలా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం అందించారు.













